
శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు నేడు ఒక శుభదినం. ప్రయాణికుల సౌకర్యార్థం తిలారు రైల్వే స్టేషన్‌లో బెర్హంపూర్–విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు అధికారిక స్టాప్ మంజూరైంది.
ఈ కొత్త హాల్టును కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు,నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నేడు లాంఛనంగా ప్రారంభించారు. రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి రైలును ప్రారంభించి, ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలక మైలురాయి అని అభివర్ణించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ ఫలితం
ఈ రైల్వే హాల్టు మంజూరు కావడం వెనుక కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల సమన్వయ కృషి ఎంతో ఉందని మంత్రులు పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన రైలు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ప్రజల విజ్ఞప్తిని మన్నించి, త్వరితగతిన ఈ హాల్టును మంజూరు చేసినందుకు గానూ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
