స్కిల్ కేసులో ఈడీ క్లీన్ చిట్: జగన్ కుట్రలు బట్టబయలు – గద్దె అనురాధ

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) క్లీన్ చిట్ ఇవ్వడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పన్నిన కుట్రలు, కుతంత్రాలు పూర్తిగా బట్టబయలయ్యాయని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి నిజాయితీని ఈ పరిణామం మరోసారి రుజువు చేసిందని ఆమె స్పష్టం చేశారు.

రాజకీయ కక్షసాధింపు చర్యలే

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై అవినీతి మరకలు అంటించి, రాజకీయంగా లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని గద్దె అనురాధ మండిపడ్డారు.
“నిప్పుకు చెద పట్టదని మరోసారి రుజువైంది. చంద్రబాబు నాయుడిని రాజకీయంగా అంతమొందించడమే లక్ష్యంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు.”
కేవలం రాజకీయ కక్షతో, ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించడం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని ఆమె అభివర్ణించారు.

యువత భవిష్యత్తుతో ఆటలు

యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ‘స్కిల్ డెవలప్‌మెంట్’ వంటి విప్లవాత్మక కార్యక్రమాన్ని కూడా వదలకుండా, వైసీపీ నేతలు రాజకీయాలకు వాడుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని గద్దె అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి పైగా వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు అబద్ధాలని ఈడీ క్లీన్ చిట్‌తో అధికారికంగా తేలిపోయిందన్నారు.

వైసీపీ క్షమాపణ చెప్పాలి

ఈడీ క్లీన్ చిట్‌తో చంద్రబాబు నాయుడి పారదర్శక పాలన రుజువైందని పేర్కొన్న ఆమె, ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి మరియు వైసీపీ నేతలు ప్రజల ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాన్ని ఎంతకాలం జైల్లో పెట్టినా బయటకు రావడం ఖాయమని, ప్రతిపక్షాన్ని అణచివేయాలన్న జగన్ ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *