నారి నారి నడుమ మురారి ‘రివ్యూ’

విడుదల తేదీ: జనవరి 14, 2026

రేటింగ్: 3/5

నటీనటులు: శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య, శ్రీ విష్ణు, సత్య.
దర్శకుడు: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రాఫర్లు: జ్ఞాన శేఖర్ వి.ఎస్, యువరాజ్
ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ భారీ అంచనాల మధ్య జనవరి 14 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ‘సామజవరగమన’ వంటి సూపర్ హిట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై బజ్ ఎక్కువగా ఉంది. మరి శర్వానంద్ తాజా చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలో చూద్దాం.

కథ

గౌతమ్ (శర్వానంద్) ఒక ఆర్కిటెక్ట్, ఇతను నిత్య (సాక్షి వైద్య)తో ప్రేమలో ఉంటాడు. అయితే నిత్య తండ్రి రామలింగయ్య (సంపత్ రాజ్), వీరి ప్రేమలో ఎలాంటి గొడవలు లేకపోవడంతో అందులో తగినంత ప్రేమ లేదని భావిస్తాడు. చివరికి పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ, రిజిస్ట్రార్ ఆఫీసులోనే పెళ్లి చేసుకోవాలని పట్టుబడతాడు. కానీ, గతంలో ఆ ప్రదేశంతో ఉన్న ఒక చేదు జ్ఞాపకం కారణంగా గౌతమ్ దానికి నిరాకరిస్తాడు. పెళ్లి సజావుగా జరగాలని గౌతమ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, పరిస్థితులు అతనికి అనుకూలించవు. అసలు ఆ ప్రదేశంతో గౌతమ్ కు ఉన్న సంబంధం ఏమిటి? అతని గతం ఏమిటి? అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉండేదా లేక ఇంతకు ముందే పెళ్ళయిందా? దియా (సంయుక్త) ఎవరు, కథలో ఆమె పాత్ర ఏమిటి? ఇవన్నీ నిత్యకు తెలుసా? అనే ప్రశ్నలకు తెరపై సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్

శర్వానంద్ పూర్తి స్థాయి కామెడీ పాత్రలో ఒదిగిపోయి, సినిమా ఆద్యంతం ఎంటర్టైన్ చేశారు.రెండు వేర్వేరు గెటప్స్ లోనూ ఆయన కన్విన్సింగ్ గా కనిపించారు.
నరేష్ ఈ సినిమాకు అతిపెద్ద బలం. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సాధారణ సన్నివేశాలను కూడా ఆయన ఎలివేట్ చేశారు. ఆయన డైలాగులు తెరపై పాత్రలను విసిగించినా, ప్రేక్షకులకు మాత్రం కడుపుబ్బ నవ్వులు పూయిస్తాయి. ఆయన కనిపించిన ప్రతిసారీ సన్నివేశాలు పండాయి.
సాక్షి వైద్య తెరపై అందంగా కనిపించారు, సంయుక్త కూడా అంతే ఆకర్షణీయంగా ఉన్నారు. ఇద్దరూ సినిమా టోన్‌కి తగ్గట్టుగా చక్కగా సెట్ అయ్యారు. సుధాకర్, వెన్నెల కిషోర్ మరియు ఇతరులు తమ పరిధి మేరకు కామెడీని పండించారు.

మైనస్ పాయింట్స్

సినిమా పాయింట్ చాలా రొటీన్‌గా, అందరికీ తెలిసిన ఫార్మాట్ లోనే ఉండడంతో, తర్వాతి సీన్లలో ఏం జరుగుతుందో సులభంగా ఊహించవచ్చు. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయినా, కథ మాత్రం చాలా సార్లు వెనకబడినట్లు అనిపిస్తుంది.
హీరోయిన్ల పాత్రలను, ముఖ్యంగా ఎమోషనల్ గా మరింత బలంగా రాసి ఉండాల్సింది. దర్శకుడు కథను సరదాగా నడపాలని భావించి, బరువైన ఎమోషన్స్ ను తగ్గించినట్లు అనిపిస్తుంది. స్క్రిప్ట్ ఇంకాస్త బలంగా ఉండి ఉంటే ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషన్ రెండూ బ్యాలెన్స్ అయ్యేవి.
సామజవరగమన‘లో అద్భుతంగా నటించిన శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ వంటి వారిని ఇందులో సరిగ్గా వాడుకోలేదు. వారి పాత్రల నిడివి తక్కువగా ఉండటం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది.

సాంకేతిక వర్గం

దర్శకుడు రామ్ అబ్బరాజు ఎమోషన్ కంటే హాస్యం మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అయితే ఇలాంటి జోనర్‌కి కనీస ఎమోషనల్ కనెక్ట్ అవసరం, అది ఇందులో కొన్ని సార్లు లోపించింది. కామెడీ అన్ని చోట్ల పండలేదు. రైటింగ్ ఇంకా టైట్‌గా ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది.
యువరాజ్, జ్ఞాన శేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ ప్లెజెంట్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ నీట్‌గా ఉంది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం పర్వాలేదు కానీ, పాటలు పెద్దగా గుర్తుండిపోయేలా లేవు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు

మొత్తంగా చూస్తే, ‘నారి నారి నడుమ మురారి’ పర్వాలేదనిపించే సంక్రాంతి ఎంటర్‌టైనర్. శర్వానంద్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోగా, సాక్షి వైద్య, సంయుక్త తమ పాత్రల పరిధిలో మెప్పించారు. నరేష్ తన అద్భుతమైన టైమింగ్‌తో సినిమాను నిలబెట్టి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించినా, ఎమోషన్స్ ఇంకాస్త బలంగా ఉండుంటే బాగుండేది. అయినప్పటికీ, సినిమాలో ఉన్న కామెడీ డోస్ వల్ల ఈ పండుగకు కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *