
“పశువుల ఆరోగ్యం – పాడి రైతు సౌభాగ్యం” నినాదంతో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభం!
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న పశుపోషకుల సంక్షేమమే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం, కీర్తిరాయునిగూడెం గ్రామంలో బుధవారం రాష్ట్రవ్యాప్త “ఉచిత పశు ఆరోగ్య శిబిరాల” (పశు ఆరోగ్య సేవలు – మన గ్రామంలోనే) కార్యక్రమాన్ని ఆయన స్థానిక నాయకులు, పాడి రైతులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెక్.. పశుసంవర్ధక రంగానికి పూర్వవైభవం
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై కుదేలైన పశుసంవర్ధక రంగానికి మళ్లీ కూటమి ప్రభుత్వం పూర్వవైభవం తీసుకువస్తుందని భరోసా ఇచ్చారు. జన్మభూమి స్ఫూర్తితో ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు జరుగుతున్నాయని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏపీ ఘనత..
గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో, గొర్రెలు-మేకల సంఖ్యలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం మనందరికీ గర్వకారణమని విజయ్ కుమార్ పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో పశుపోషణ చేస్తూ, ఉత్పాదకత పెంచి ప్రతి రైతు కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు తోట మాధవరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు వెంకటేశ్వరరావు, గాలి రాంబాబు, దొండపాటి రాంబాబు, యువరాజ్, నాగులపాటి సత్యనారాయణ, కొణతం రామకృష్ణ, నాగరాజు, కందుల ఉమామహేశ్వరరావు, వెటర్నరీ డాక్టర్ డా. దివ్య, ఇతర వెటర్నరీ సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.
రైతులకు వరంగా ప్రభుత్వ పథకాలు
పశుపోషకుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఆయన వివరించారు:
- పశుదాణా: రూ.52 కోట్లతో 50% రాయితీపై పశుదాణా పంపిణీ.
- పశుగ్రాసం: రూ.28.32 కోట్లతో 75% రాయితీపై పశుగ్రాస విత్తనాల సరఫరా.
- పశుబీమా: పశువుల అకస్మిక మరణం సంభవిస్తే రైతు నష్టపోకుండా ఉండేందుకు 85% రాయితీతో పశుబీమా పథకం అమలు.
